Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను తప్పించడానికి కేంద్రం నిర్ణయం!
- నేడు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్తో నరసింహన్ భేటీ
- ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
- మే తొలి వారం, లేదంటే కర్ణాటక ఎన్నికలు ముగిశాక కొత్త గవర్నర్ ప్రకటన?
దశాబ్దానికిపైగా గవర్నర్గా కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఇదే చివరిసారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. తటస్థంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు రావడంతో నరసింహన్ను ఇక పొడిగించకూడదని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ వచ్చిన గవర్నర్ నేడు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలుసుకోనున్న నేపథ్యంలో పొడిగింపు వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పొడిగింపు విషయం నేడే తేలిపోతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
గవర్నర్ తీసుకున్న పలు నిర్ణయాలు విమర్శలకు తావిస్తుండడంతో ఆయనను తప్పించాలని కేంద్రం నిర్ణయించిందని, రాజ్నాథ్ పిలుపు మేరకే ఆయన హస్తినకు వచ్చారని సమాచారం. డిసెంబరు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన నరసింహన్ ఇప్పటి వరకు రెండుసార్లు పొడిగింపు పొందారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో నరసింహన్ ఒక్కరే ఇంకా కొనసాగుతుండడం విశేషం. గతేడాది మేతో ఆయన పదవీకాలం ముగిసినా ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని తాత్కాలికంగా పెంచింది.
తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్న నరసింహన్ కొన్ని రాజకీయ పార్టీలవైపు మొగ్గుచూపుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఆయన తటస్థంగా వ్యవహరించడం లేదని, రాజకీయ దురుద్దేశంతో కేంద్రానికి నివేదికలు పంపుతున్నారని విమర్శిస్తున్నారు. అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుతం చంద్రబాబు ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇక, ఆయనను తొలగించాలంటూ స్వయంగా ఏపీ బీజేపీ శాఖ కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం. అయితే, రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను అలవోకగా చక్కబెడుతున్నారన్న కారణంతో ఆయనపై వచ్చిన విమర్శలను కేంద్రం ఇప్పటి వరకు పక్కనపెట్టేసింది. అయితే, ఇప్పటికే ఆయన సుదీర్ఘంగా పదవిలో ఉండడంతో ఆయనను తప్పించడమే మేలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్టు సమాచారం. మే మొదటి వారంలో కానీ, లేదంటే కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత కానీ కొత్త గవర్నర్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.