Konda Surekha: బహిరంగంగానే వెళ్తాం కానీ, దొంగచాటుగా వెళ్లం: కొండా సురేఖ, కొండా మురళి
- జనాల్లో ఉండే నేతలమనే కేసీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు
- పార్టీ మారుతున్నామనేది అసత్య ప్రచారం
- మా కూతురుకు కూడా టీఆర్ఎస్ టికెట్ వస్తుంది
ప్రజలతో మమేకమై, జనాల మధ్యే ఉండే నాయకులమని తెలిసే ముఖ్యమంత్రి కేసీఆర్ తమను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని కొండా సురేఖ, కొండా మురళి తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామనే దుష్ప్రచారాన్ని కొందరు చేస్తున్నారని... అలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు. ఒకవేళ పార్టీ మారే ఆలోచనే ఉంటే బహిరంగంగానే వెళ్తామని, దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తమకు నమ్మకం ఉందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో తాము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తమ కూతురు సుస్మితా పటేల్ కు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని... కొండా దంపతులు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం తమ సొంత డబ్బులతోనే వారికి కాంట్రాక్టు లైసెన్సులు ఇప్పించామని చెప్పారు. త్వరలోనే రూ. 32 కోట్ల పనులను కార్యకర్తలకు కేటాయించబోతున్నట్టు తెలిపారు. తమ వెంటే ఉంటూ కొంత మంది వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు.