Anam Vivekanandareddy: వైఎస్ స్వయంగా పిలిచి మంత్రి పదవిని ఆఫర్ చేసినా తనకొద్దన్న ఆనం వివేకా... మృతితో చిన్నబోయిన సింహపురి!
- విలక్షణ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న నేత
- బోన్ క్యాన్సర్ కు చికిత్స పొందుతూ మృతి
- కన్నీరు పెడుతున్న నెల్లూరు ప్రజలు
ఆయన ఏం చేసినా స్టయిలే. గన్ మెన్లు లేకుండా ప్రజల్లోకి వెళతాడు. చూసిన సినిమాలే నగరంలో ఉన్నా రోజూ సెకండ్ షో చూస్తాడు. పదిమందిలో నడిరోడ్డుపై నృత్యాలు చేస్తాడు. గుప్పుగుప్పున సిగరెట్ తాగి పొగ వదులుతాడు. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే పట్టించుకోకుండా వ్యంగ్యాస్త్రాలు వేస్తాడు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఏ ప్రొడక్టునైనా తన సొంతం చేసుకుని వాడుతాడు. రోడ్డు పక్కన దాబాలో కూర్చుని బిర్యానీ తింటాడు. తన జీవితాన్ని అందరికీ తెలిసేలా జల్సాగా అనుభవిస్తాడు...ఇదంతా అదో స్టయిల్ తో కూడుకుని ఉంటుంది. ఆయనే ఆనం వివేకానందరెడ్డి.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నిష్క్రమణం తరువాత తన రాజకీయ చతురతతో క్రమంగా పట్టు సాధించి చక్రం తిప్పిన నేత. బోన్ క్యాన్సర్ కు చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన మరణించడంతో సింహపురి చిన్నబోయింది. విలక్షణ రాజకీయ నేతగా, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనం మృతితో నెల్లూరు ప్రజలు విషాదంలో మునిగారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆనం వివేకా, మంత్రి పదవిని సైతం వదులుకున్నారు. వైఎస్ స్వయంగా పిలిచి తన క్యాబినెట్ లో స్థానం ఇస్తానని చెప్పిన వేళ, సున్నితంగా తిరస్కరిస్తూ, తన తమ్ముడైన రామనారాయణ రెడ్డికి పదవిని ఇప్పించుకున్నారు. వర్తమాన రాజకీయాల్లో ఉంటూ అంత ఆనందంగా, అంత కులాసాగా జీవితాన్ని గడిపిన మరో వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. నెల్లూరులోని వీధివీధిలో అభిమానులను సంపాదించుకున్న ఆయన మృతి పట్ల పలువురు నగర వాసులు కంటతడి పెట్టుకుంటున్నారు.