Narendra Modi: ఐసీసీ అధికారిక ట్విట్టర్లో మోదీ-ఆశారాం బాపు వీడియో.. వైరల్ కావడంతో డిలేట్
- 'నారాయణ నారాయణ' అంటూ పేర్కొన్న వైనం
- గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి వీడియో
- చివరకు సారీ చెప్పిన ఐసీసీ
- పొరపాటుగా పోస్టయిందని వివరణ
ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాపుకి ఈ రోజు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేయడం తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఐసీసీ పోస్టు చేసిన వీడియోలో ఆశారాం బాపుతో కలిసి ప్రధాని మోదీ ఉన్నారు. ఈ పోస్టులో 'నారాయణ.. నారాయణ' అని ఐసీసీ పేర్కొంది.
ఈ ట్వీట్ వైరల్ అవుతుండడంతో ఐసీసీ దాన్ని డిలేట్ చేసింది. చివరకు ఐసీసీ ఈ విషయంపై స్పందించి, తమ ట్విట్టర్ ఖాతాలో క్రికెట్‌కు సంబంధంలేని ఓ ట్వీట్‌ను గుర్తించామని, ఆ ట్వీట్ వల్ల ఎవరైనా బాధపడితే సారీ అని పేర్కొంది. ట్విట్టర్ అకౌంట్ పనులు చూసే ఓ వ్యక్తి పొరపాటుగా ఈ పోస్ట్ చేశాడని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆశారాం బాపుతో కలిసి ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ వీడియోనే ఇలా ఐసీసీ ఖాతాలో దర్శనమిచ్చింది.