narasimhan: అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? అని చంద్రబాబును అడిగా.. ఆయన నిరాకరించారు!: గవర్నర్ నరసింహన్

  • రాష్ట్రపతి పాలన విధించి.. అధికారాన్ని అనుభవించాలనే కోరిక లేదు
  • చంద్రబాబు, కేసీఆర్ లతో మంచి సంబంధాలు ఉన్నాయి
  • మీ వార్తలను చూసే.. చంద్రబాబు నాపై అలా స్పందించి ఉంటారు

ఢిల్లీ వెళ్లిన సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఆసక్తికర అంశాలను మీడియాకు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గరుడ చేపట్టిందంటూ వస్తున్న కథనాలపై గవర్నర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... తాను ఛత్తీస్ గఢ్ నుంచి ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రచారమే జరిగిందని ఆయన అన్నారు. వంద మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రపతి పాలన విధించి, అధికారాన్ని అనుభవించాలనే కోరిక, ఆలోచన తనకు లేవని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అంటూ చంద్రబాబును తాను అడిగానని... దానికి ఆయన నిరాకరించారని నరసింహన్ చెప్పారు. ఆ తర్వాతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్ లతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని చెప్పారు.

'మీపై చంద్రబాబు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు కదా?' అనే ప్రశ్నకు సమాధానంగా... చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని నరసింహన్ చెప్పారు. మీరే తన గురించి ఏదో రాసి ఉంటారని... ఆ నేపథ్యంలో చంద్రబాబు అలా స్పందించి ఉంటారని అన్నారు. రాజకీయ నాయకుల ద్వారానే మాకు అలాంటి సమాచారం అందుతుందని మీడియా ప్రతినిధులు చెప్పగా... వారు తనను కలిసినప్పుడు తాము ఎన్నడూ అలా చెప్పలేదని అంటారని, వెళ్లేటప్పుడు కాళ్లకు నమస్కారం పెట్టి వెళ్తారని చమత్కరించారు.

మరోవైపు, గవర్నర్ గా నరసింహన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో ఆయన భేటీ అవుతారనే ప్రచారం జరిగినప్పటికీ... ఎవరినీ కలవకుండానే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. 

  • Loading...

More Telugu News