hdfc bank: హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు డిపాజిట్లపై ఒక శాతం పెరిగిన వడ్డీ రేటు
- ఏడాది పదిహేడు రోజులు దాటిన డిపాజిట్లపై 7 శాతం
- సీనియర్ సిటిజన్లకు అదనంగా అరశాతం ఆఫర్
- రూ.కోటి దాటిన బల్క్ డిపాజిట్లపై పావు శాతం పెంపు
ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు వివిధ కాల పరిమితుల డిపాజిట్లపై ఒక శాతం వరకు వడ్డీ రేట్లను పెంచింది. దీంతో బ్యాంకులో కొత్తగా డిపాజిట్ చేసే వారికి అధిక వడ్డీ రేటు దక్కనుంది. మరిన్ని నిధులను డిపాజిట్ల రూపంలో ఆకర్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
పెంపు అనంతరం ఏడాది పదిహేడు రోజుల నుంచి ఐదేళ్ల కాల వ్యవధి వరకు చేసే అన్ని డిపాజిట్లపైనా ఇక మీదట 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు దాటిన వారు) అదనంగా మరో అర శాతం వడ్డీ రేటు అంటే 7.5 శాతం లభించనుంది. రూ.కోటి నుంచి రూ.ఐదు కోట్ల లోపు చేసే బల్క్ డిపాజిట్లపైనా పావు శాతం రేటు పెంచింది. గత నెలలో ప్రభుత్వరంగ ఎస్ బీఐ బ్యాంకు సైతం డిపాజిట్ రేట్లను అర శాతం వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.