sri reddy: మంత్రి కేటీఆర్ కి శ్రీరెడ్డి వినతి!
- కేటీఆర్ కు చేరువగా ఉండేందుకే ఖాతా తెరిచాను
- నా పోరాటం మొదలైనప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయి
- భయపడి బయటకు రావట్లేదు
- కేటీఆర్ కల్పించుకుంటే ఇది సాధ్యమవుతుంది
తను ట్విట్టర్ ఖాతా తెరవడానికి గల ప్రధాన కారణాలలో ఒక దాని గురించి నటి శ్రీరెడ్డి ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేసింది. మంత్రి కేటీఆర్ కు చేరువగా ఉండేందుకు, సాధ్యమైనంత తొందరగా ఆయన అపాయింట్ మెంట్ పొందేందుకే తాను ఖాతా తెరిచానని పేర్కొంది. తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా తాను గళం విప్పి, పోరాటం చేస్తున్నప్పటి నుంచి తనకు పలు బెదిరింపులు వస్తున్నాయని వాపోయింది.
ఒంటరి మహిళగా జీవిస్తున్న తనపై అత్యాచారం చేస్తామని, హతమారుస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆ ట్వీట్ లో పేర్కొంది. ఇంట్లో నుంచి అడుగు పెట్టలేని పరిస్థితుల కారణంగా బలవంతపు గృహనిర్బంధంను అనుభవిస్తున్నానని తెలిపింది. తన ఇంటి వద్ద మాత్రమే సెక్యూరిటీ కల్పిస్తామని పోలీసులు చెప్పారు కానీ, ఏదైనా అవసరం నిమిత్తం తాను బయటకు వెళితే తనకు రక్షణ కల్పించడం కుదరదని చెప్పారని శ్రీరెడ్డి పేర్కొంది.
లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా తన గళం వినిపించినప్పటి నుంచి శిక్షకు గురవుతున్నానని, తన జీవితం తాను తిరిగి పొందాలనుకుంటున్నానని.. ఈ విషయంలో కేటీఆర్ కల్పించుకుంటే ఇది సాధ్యమవుతుందని కోరుకుంటున్నానని శ్రీరెడ్డి అభిప్రాయపడింది.