by polls: నాలుగు లోక్ సభ, పది అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
- మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ లలో ఉపఎన్నికలు
- మే 3న నోటిఫికేషన్ విడుదల
- మే 28న పోలింగ్, 31న కౌంటింగ్
- ఎన్నికల కమిషన్ ప్రకటన
దేశంలోని నాలుగు లోక్ సభ స్థానాలకు, పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన చేసింది. మే 3న నోటిఫికేషన్ విడుదల కానుందని, మే 28న పోలింగ్, మే 31న కౌంటింగ్ జరగనున్నట్టు తెలిపింది. మహారాష్ట్రలోని భండారా-గోండియా, పాల్గర్, ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోక్ సభ స్థానాలతో పాటు నాగాలాండ్ లోని ఒక లోక్ సభ స్థానానిక ఈ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇక, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ లోని ఆయా అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.
కాగా, భాండారా- గోండియా లోక్ సభ నియోజకవర్గానికి నేతృత్వం వహించే బీజేపీ ఎంపీ నానా పటోల్ ఆ పార్టీ నుంచి గత ఏడాది బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ఎంపీ చింతామన్ వాంగ్యా మృతి చెందడంతో పాల్గర్ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. ఫిబ్రవరిలో బీజేపీ ఎంపీ, సీనియర్ నేత హుకుమ్ సింగ్ మరణంతో కైరానా స్థానం ఖాళీ అయింది.
ఇక, నాగాలాండ్ లోక్ సభ స్థానానికి నెయిఫియూ రియో నేతృత్వం వహించేవారు. అయితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెయిపియూ రియో ఇటీవల ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో, ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో, ఆయా స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు.