Andhra Pradesh: చంద్రబాబు రెండుసార్లు మందలించినా మారని అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి... నేడు తన వద్దకు రావాలని ఆదేశం!
- నేతల మధ్య తారస్థాయికి విభేదాలు
- పార్టీకి నష్టం కలుగుతుందన్న అభిప్రాయంలో చంద్రబాబు
- రాళ్లదాడి తరువాత సమస్య తీవ్రం
కర్నూలు జిల్లాలో మంత్రి అఖిలప్రియ, పార్టీ నేత ఏపీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో, వారి మధ్య గొడవలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని భావించిన చంద్రబాబు, ఇప్పటికే రెండుసార్లు వారిని మందలించినా ఫలితం లేకుండా పోయింది. భూమా నాగిరెడ్డి మరణించిన తరువాత వీరిమధ్య విభేదాలు తెరపైకి రాగా, తెలుగుదేశం పార్టీ తలపెట్టిన సైకిల్ యాత్రలను వేరువేరుగా ఇద్దరు నేతలూ చేయడం, సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో సమస్య మరింత తీవ్రమైంది.
అఖిల, సుబ్బారెడ్డిలు వచ్చి తనను కలవాలని నాలుగు రోజుల క్రితమే చంద్రబాబు ఆదేశించినప్పటికీ, వివిధ కారణాలను సాకుగా చూపుతూ అఖిలప్రియ రాలేదు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు, ఇద్దరూ వచ్చి తనను కలవాలని మరోసారి ఆదేశించారు. నేటి మధ్యాహ్నం వీరిద్దరూ చంద్రబాబుతో భేటీ అవుతారని సమాచారం. కాగా, వాస్తవానికి ఈ సమావేశం గత రాత్రి జరగాల్సి వుంది. అయితే అఖిలప్రియ హాజరుకాని కారణంగానే నేటికి వాయిదాపడ్డట్టు తెలుస్తోంది.