IPL: ఐపీఎల్లో తొలిసారి బౌలర్ల మ్యాచ్.. పంజాబ్‌పై హైదరాబాద్ విజయం!
- విజృంభించిన ఇరుజట్ల బౌలర్లు
- ఐదు వికెట్లు తీసిన అంకిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
- స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిల పడిన పంజాబ్
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల బాటలో దూసుకుపోతోంది. విజయాలను అలవాటుగా మార్చుకున్న విలియమ్సన్ సేన గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసినా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో విజయం సాధించగలిగింది.
ఓపెనర్లు శిఖర్ ధవన్ (11), కెప్టెన్ విలియమ్సన్ (0)లు క్రీజులో నిలదొక్కుకునేందుకు తడబడ్డారు. ఆ తర్వాత వచ్చిన వృద్ధిమాన్ సాహా కూడా ఆరు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 54 పరుగులు చేసి జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. షకీబల్ హసన్ 28, యూసుఫ్ పఠాన్ 21 పరుగులు చేయడంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 132 పరుగులు చేసి ప్రత్యర్థి పంజాబ్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది.
అనంతరం 133 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను హైదరాబాద్ బౌలర్లు దారుణంగా దెబ్బ తీశారు. ఫలితంగా 119 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. పంజాబ్ జట్టులో ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (32), క్రిస్ గేల్ (23), తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లు రషీద్ ఖాన్ 3, సందీప్ శర్మ 2, బాసిల్ థంపీ 2, షకీబల్ హసన్ 2 వికెట్లు తీసుకుని పంజాబ్‌ను కుప్పకూల్చారు. వీరి దెబ్బకు ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం విశేషం. ఐదు వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ అంకిత్ రాజ్పూట్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.