India: జిన్ పింగ్ తో కలసి బోట్ రైడ్ కెళ్లిన నరేంద్ర మోదీ!
- ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ
- వూహాన్ కు వచ్చి కలిసిన జిన్ పింగ్
- పలకరింపుల తరువాత విహారానికి
ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపే ముందు ఆయనతో కలసి సేదదీరుతున్నారు. గత రాత్రి ఆయన చైనీస్ ప్రావిన్స్ ఆఫ్ హుబేయ్ రాజధాని వూహాన్ కు చేరుకోగా, నేటి సాయంత్రం వీరిద్దరి సమావేశం జరగనుంది. ఇక స్థానిక మ్యూజియం వద్ద కలిసిన ఇద్దరు నేతలూ, పలకరింపుల తరువాత నగరంలోని ఓ సరస్సు వద్దకు విహారానికి వెళ్లారు. కాసేపు కలసి నడుస్తూ కబుర్లు చెప్పుకున్న అనంతరం, బోట్ రైడింగ్ చేశారు.
కాగా, ప్రతి దేశం నుంచి ఆరుగురు చొప్పున దౌత్యాధికారులతో రెండు రౌండ్ల పాటు సమావేశాలు జరగనుండగా, వీటికి ఇరు దేశాధినేతలూ హాజరు కానున్నారు. ఆ తరువాత సెంట్రల్ వుహాన్ లోని ఈస్ట్ లేక్ గెస్ట్ హౌస్ లో మోదీ గౌరవార్థం జిన్ పింగ్ విందును ఏర్పాటు చేశారు. ఆపై రేపు ఇద్దరి మధ్యా మరోసారి చర్చలు సాగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. గత సదస్సుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల అమలు, రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య బంధాలు, సరిహద్దుల్లో పరిస్థితులతో పాటు ఎకనామిక్ కారిడార్ తదితర అంశాలూ ప్రస్తావనకు రానున్నాయి.