Donald Trump: ట్రంప్ ‘లోకల్’ రాజకీయం... అమెరికా కంపెనీలకే హెచ్1బీ వీసాల్లో పెద్ద పీట!
- అమెరికా కంపెనీలకు గతేడాది భారీగా పెరిగిన అనుమతులు
- అదే సమయంలో భారత కంపెనీలకు కోత
- అమేజాన్ కు పెద్ద మొత్తంలో కేటాయింపు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం హెచ్1బీ వీసాలపై స్పష్టంగా ప్రతిఫలించింది. 2017 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్1బీ వీసాల్లో అమెరికన్ కంపెనీలకే పెద్ద పీట వేశారు. అదే సమయంలో భారత ఐటీ కంపెనీలకు సగానికి కోత వేయడం పరిస్థితికి నిదర్శనం. అమేజాన్ కు 2,515 హెచ్1బీ వీసాలు మంజూరయ్యాయి. మైక్రోసాఫ్ట్ 1,479, ఇంటెల్ 1,230, గూగుల్ 1,213, ఫేస్ బుక్ 720, యాపిల్ కంపెనీకి 673 చొప్పున హెచ్1బీ వీసాలు లభించాయి.
అమేజాన్ కు 2016లో దక్కినవి 1,416 అయితే, 2017లో ఈ సంఖ్య 2,515కు చేరడం గమనార్హం. ఫేస్ బుక్ కు కూడా 248 అధికంగా లభించాయి. యాపిల్ దరఖాస్తుల ఆమోదాల్లో 7 శాతం పెరుగుదల ఉంది. మరోవైపు 2015 నాటితో పోలిస్తే 2017 నాటికి భారత్ కు చెందిన ఏడు ఐటీ కంపెనీలకు హెచ్1బీ ఆమోదాల్లో 43 శాతం క్షీణత ఉన్న విషయం తెలిసిందే. అత్యధిక నైపుణ్యాలున్న విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఈ వీసాలను అమెరికా జారీ చేస్తుంది.