INDU MALHOTRA: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా ప్రమాణ స్వీకారం
- న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తొలి మహిళ
- సుప్రీంకోర్టుకు ఏడవ మహిళా న్యాయమూర్తి
- ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా
దేశ చరిత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రముఖ సీనియర్ మహిళా న్యాయవాది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు. న్యాయవాది నుంచి నేరుగా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఈమె పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
సుప్రీంకోర్టులోకి అడుగు పెట్టిన ఏడవ మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా కావడం గమనార్హం. జస్టిస్ ఎం. ఫాతిమాబీవి, జస్టిస్ సుజాతా వి మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ గ్యాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ ఆర్ భానుమతి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులుగా పనిచేశారు. వీరిలో జస్టిస్ ఆర్ భానుమతి ఒక్కరే ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్నారు.
ఇందు మల్హోత్రాతోపాటు ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర సర్కారు మల్హోత్రా నియామకానికి ఓకే చెప్పి, కేఎం జోసెఫ్ నియామకాన్ని వ్యతిరేకించింది. ఈ కారణంగా ఈ రోజు ఇందు మల్హోత్రా ఒక్కరే ప్రమాణం చేశారు.