TRS: హెటిరో డ్రగ్స్ కంపెనీకి అంత తక్కువ రేటుకి భూమిని ఎందుకు ఇచ్చారో చెప్పాలి!: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ డిమాండ్
- హెటిరో డ్రగ్స్ కంపెనీకి అతి తక్కువ ధరకే భూమిని కట్టబెట్టారు
- ఖరీదైన ప్రాంతంలో భూమిని అంత తక్కువ ధరకే ఇస్తారా?
- మంత్రి కేటీఆర్ కు జయేష్ రంజన్ పూర్తిగా సహకరించారు
- రంగారెడ్డి జిల్లాలో కూడా భూముల అవకతవకలు జరిగాయి
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని త్వరలోనే బయటపెడతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హెటిరో డ్రగ్స్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం పదిహేను ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టిందని ఆరోపించారు. ఖరీదైన ప్రాంతంలో భూమిని అంత తక్కువ ధరకే ‘హెటిరో’కు ఎందుకిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, ‘హెటిరో’కు అన్ని రకాల రాయితీలు ఇచ్చారని విమర్శించారు. ఈ దోపిడీ విషయంలో మంత్రి కేటీఆర్ కు జయేష్ రంజన్ అనే అధికారి పూర్తిగా సహకరించారని, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు మంత్రి హరీశ్ రావు ఇంట్లోనే జరిగాయని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా 800 ఎకరాల భూములకు సంబంధించి అవకతవకలు జరిగాయని, ఈ వ్యవహారంలో కేటీఆర్ కు, జయేష్ రంజన్ కు ఎంతెంత ముట్టాయో తేలుస్తామని, తాము అధికారంలోకి రాగానే ఈ విషయమై విచారణ చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.