Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హంతకురాలికి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు
- తనను విడుదల చేయాలంటూ పిటిషన్ పెట్టుకున్న నళిని
- కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున.. నిర్ణయం తీసుకోలేమన్న హైకోర్ట్
- నళిని పిటిషన్ కొట్టివేత
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషి నళినీ శ్రీహరన్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనను విడుదల చేయాలంటూ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. 1994లో తమిళనాడు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకం కింద తనను విడుదల చేయాలంటూ నళిని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆమె పిటిషన్ ను సింగిల్ జడ్జి బెంచ్ కొట్టేసింది. దీంతో రెండు రోజుల క్రితం ఆమె మరోసారి పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన సుబ్రహ్మణియన్, శశిధరణ్ ల ధర్మాసనం నేడు పిటిషన్ ను కొట్టేసింది. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈ నేపథ్యంలో పిటిషన్ పై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని తెలిపింది.
తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ద్వారా 20 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన వారిని విడుదల చేస్తారు. నళిని దాదాపు 25 ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్నారు. దీంతో, తనను విడుదల చేయాలంటూ ఆమె పిటిషన్ దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో, ఆమెను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో... కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో, నళిని విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. మరోవైపు గతంలో రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందిస్తూ, తన తండ్రి హంతకులను తాము పూర్తిగా క్షమించేశామని చెప్పారు. తనకు, తన సోదరి ప్రియాంకకు ప్రజలను ద్వేషించడం కష్టంగా ఉందని తెలిపారు.