civil services: కోచింగ్ లేకుండానే, కోటి రూపాయల జీతం వదిలేసి.. ఐఏఎస్ సాధించిన తెలుగుతేజం!
- సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు
- టాపర్ గా నిలిచిన అనుదీప్
- కోచింగ్ లేకుండానే 24వ ర్యాంకు సాధించిన పృథ్వితేజ్
సివిల్స్ లో తెలుగు తేజాలు సత్తా చాటారు. తెలంగాణ జగిత్యాల జిల్లాకు చెందిన దురిశెట్టి అనుదీప్ టాపర్ గా నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహర్ష ఆరో ర్యాంకు సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యిమ్మిడి పృథ్వీతేజ్ 24వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న పృథ్వితేజ్ ఆ తర్వాత శామ్ సంగ్ కంపెనీలో ఏడాదికి కోటి వేతనంతో ఒక ఏడాది పాటు ఉద్యోగం చేశారు.
ఆ తర్వాత ఉద్యోగాన్ని మానేసి, సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. కోచింగ్ కూడా తీసుకోకుండానే, సొంతంగా ప్రిపేర్ అయ్యారు. చివరకు సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటి 24వ ర్యాంకును సాధించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి చదువులో తమ కుమారుడు మంచి ప్రతిభను కనబరిచేవాడని తెలిపారు. కాగా, అప్పట్లో పృథ్వీతేజ్ ఐఐటీ ఎంట్రన్స్ లో దేశం మొత్తం మీద తొలి ర్యాంక్ సాధించిన సంగతి చాలా మందికి గుర్తుండే వుంటుంది.