KCR: కేసీఆర్ రోజురోజుకూ భరించలేనంతగా తయారవుతున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కాంగ్రెస్ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు
- 16 ఏళ్ల వయసులోనే ప్రాణాలకు తెగించి సైన్యంలో చేరాను
- ప్రధాని నివాసం కూడా ప్రగతి భవన్ లా ఉండదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని... రోజురోజుకూ ఆయనను భరించడం కష్టమవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నిన్న టీఆర్ఎస్ ప్లీనరీలో తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని... కాంగ్రెస్ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారని అన్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఎదుటివారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని చెప్పారు. 16 ఏళ్ల వయసులోనే ప్రాణాలను లెక్క చేయకుండా తాను సైన్యంలో చేరానని... ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కేసీఆర్ మాదిరి తమకు దొంగ తెలివితేటలు లేవని ఎద్దేవా చేశారు.
ప్రగతి భవన్ లో 150 గదులు ఉన్నాయని తాను అనలేదని ఉత్తమ్ అన్నారు. రూ. 500 కోట్లు విలువ చేసే భూమిలో రూ. 60 కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్ కట్టారని... ఎవడబ్బ సొమ్మని ఇంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేసీఆర్... ఆయన మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని విమర్శించారు. ప్రధాని ఉండే నివాసం కూడా ప్రగతి భవన్ లా ఉండదని దుయ్యబట్టారు.