bcci: సారీ.. మేము దానికి అంగీకరించలేం: ఆఫ్ఘనిస్థాన్ కు స్పష్టం చేసిన బీసీసీఐ
- షార్జాలో టీ20 లీగ్ నిర్వహించనున్న ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు
- ఆటగాళ్లను పంపాలంటూ బీసీసీఐకి విన్నపం
- వేరే లీగ్ లలో మా ఆటగాళ్లు ఆడరని చెప్పిన బీసీసీఐ
క్రికెట్ లో ఇప్పుడు టీ20 హవా నడుస్తోంది. దాదాపు అన్ని దేశాలు టీ20 టోర్నీని నిర్వహిస్తున్నాయి. ఈ క్రేజ్ నేపథ్యంలో టీ20లు ఆడే 102 దేశాలకు ఐసీసీ అంతర్జాతీయ హోదాను కల్పించింది. ఈ క్రమంలో అక్టోబర్ 5 నుంచి 24 వరకు షార్జా వేదికగా టీ20 లీగ్ నిర్వహించేందుకు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సన్నాహకాలు చేస్తోంది. భారత క్రికెటర్లు తమ టోర్నీలో ఆడేందుకు అనుమతించాలని బీసీసీఐను ఏసీబీ కోరింది. అయితే, ఈ విన్నపాన్ని బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది.
తమ ఆటగాళ్లు ఐపీఎల్ లో తప్ప మరే ఇతర టీ20 లీగ్ లోనూ ఆడటం లేదని ఏసీబీకి బీసీసీఐ తెలిపింది. మీ లీగ్ లో ఆడేందుకు అనుమతిస్తే... ఇతర దేశాలు కూడా అడుగుతాయని... దానికి తాము సిద్ధంగా లేమని చెప్పింది. ఒక్క ఆటగాడిని అనుమతించినా... అందరినీ అనుమతించాల్సి వస్తుందని తెలిపింది. బీసీసీఐ కాంట్రాక్టులో లేని ఆటగాళ్లనైనా పంపాలని ఏసీబీ కోరగా... బీసీసీఐ దానికి కూడా అనుమతించలేదు. మీ లీగ్ కు ఆటగాళ్లను పంపకపోయినా... ఏసీబీకి తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.