Civil Engineers: త్రిపుర సీఎం మళ్లీ నోరు జారారు.. సివిల్స్‌కు సివిల్ ఇంజినీర్లే సూపరట!
- వరుసపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బిప్లబ్ దేబ్
- మొన్న మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందన్నారు
- నిన్న డయానా హైడెన్‌కు మిస్ వరల్డ్ కిరీటం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు
- మున్ముందు ఇంకెన్ని వినాల్సి వస్తుందో అంటూ నెటిజన్ల సెటైర్లు
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సివిల్స్‌కు మెకానికల్ ఇంజినీర్లు పనికిరారని, సివిల్ ఇంజినీర్లు సివిల్స్‌కు బాగా సూటవుతారని విచిత్రమైన భాష్యం చెప్పారు. అగర్తలలో నిర్వహించిన ‘సివిల్ సర్వీస్ డే’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మెకానికల్ ఇంజినీర్ల వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని, అదే సివిల్ ఇంజినీర్లు అయితే ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలు పంచుకుంటారని చెప్పారు. వారికి బోల్డన్ని తెలివి తేటలు, అనుభవం ఉంటాయని, సమాజ నిర్మాణంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయని కొనియాడారు.
సివిల్స్ పోస్టుల్లోకి వైద్యులు వచ్చినా బాగానే ఉంటుందని రోగాన్ని నయం చేసే తెలివి వారి వద్ద ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. ఈ నెల 27న ఆయన మాట్లాడుతూ.. 21 ఏళ్ల క్రితం భారత్‌కు చెందిన డయానా హైడెన్‌ను ‘మిస్ వరల్డ్’గా ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. అంతర్జాతీయ అందాల పోటీల విజేతలు ముందే నిర్ణయమైపోతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందమంటే దేవతలైన లక్ష్మీదేవి, సరస్వతీ దేవిలా ఉండాలని, మిస్ వరల్డ్‌కు డయానా అనర్హురాలని పేర్కొని కలకలం రేపారు.
అంతకుముందు ఇంటర్నెట్ ఇప్పటిది కాదని, మహాభారతం కాలంలోనే ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. వరుసపెట్టి ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ముందుముందు ఇంకెన్ని వినాల్సి వస్తుందోనని కామెంట్లు చేస్తున్నారు.