Mumbai: దారుణం: ఆసుపత్రిలో కోమాలో ఉన్న రోగి కన్ను కొరికేసిన ఎలుకలు!
- మెదడుకు సర్జరీ చేస్తుండగా రెండు నెలల క్రితం కోమాలోకి వెళ్లిన యువకుడు
- రోగి కన్ను కొరికిన ఎలుక.. ముఖమంత్రా రక్తస్రావం
- అలాంటిదేమీ లేదంటున్న వైద్యులు
ముంబైలోని హిందూహృదయ సమ్రాట్ బాలాసాహెబ్ థాకరే ఆసుపత్రిలో దారుణం జరిగింది. రెండు నెలలుగా కోమాలో ఉన్న 27 ఏళ్ల రోగి కుడి కన్నును ఎలుకలు కొరికేశాయి. ఆసుపత్రిలో జనరల్ వార్డులో ఈ ఘటన జరిగింది.
థానేకు చెందిన పర్మిందర్ గుప్తాకు మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో రెండు నెలల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ చేశారు. అది కాస్తా వికటించడంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. అదే ఆసుపత్రిలో 40 రోజులు ఉన్నప్పటికీ పరిస్థితో మార్పు రాకపోవడంతో అతడిని హిందూహృదయ సమ్రాట్ బాలాసాహెబ్ థాకరే ఆసుపత్రికి తరలించినట్టు గుప్తా సోదరి నిర్మల తెలిపారు. తాజాగా గుప్తాను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు.
కుమారుడి దగ్గర తానే ఉన్నానని, అప్పుడు రెండు సార్లు గదిలో ఎలుకలు తిరుగుతుంటే తరిమానని గుప్తా తండ్రి రామ్ తెలిపారు. రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఉదయం ఓ నిమిషం పాటు కునుకు తీశానని, ఆలోపే ఓ ఎలుక వచ్చి కుమారుడి కుడి కన్నును కొరికిందని తెలిపారు. దీంతో అతడి ముఖమంతా రక్తంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం వైద్యులకు చెప్పడంతో వారు వెంటనే టెటానస్ ఇంజక్షన్ తీసుకురమ్మని చెప్పి రోగిని తిరిగి ఐసీయూలోకి తరలించాలని పేర్కొన్నారు.
అయితే, ఆసుపత్రి యాజమాన్యం మాత్రం గుప్తా కుటుంబ సభ్యుల ఆరోపణలను కొట్టిపడేసింది. కన్నుకు అయిన గాయం ఎలుక కొరకడం వల్ల అయినది కాదని పేర్కొన్నారు. ఆసుపత్రి పేరును అప్రతిష్ఠ పాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రి ఆఫ్తామాలజిస్ట్ కన్నును పరిశీలించారని, ఎటువంటి గాయాలు లేవని చెప్పారని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్ఎస్ బావా తెలిపారు.