KCR: నా బ్రదర్ స్టాలిన్‌ను కలవడానికి వచ్చాను: చెన్నైలో భేటీ తరువాత కేసీఆర్
- కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సహా చాలా అంశాలపై చర్చించాను
- దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉంది
- ఇటీవల మమతా బెనర్జీతోనూ చర్చించా
'ఈ రోజు నేను నా బ్రదర్ స్టాలిన్‌ను కలవడానికి వచ్చాను. ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోన్న కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సహా చాలా అంశాలపై చర్చించాను' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే నేతలతో పాటు పలువురితో చర్చించడానికి ఈ రోజు చెన్నైలో పర్యటిస్తోన్న కేసీఆర్.. స్టాలిన్‌తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడారు.
దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని, రాజకీయాల్లో మార్పు అవశ్యకతపై ఇటీవల మమతా బెనర్జీతోనూ చర్చించానని కేసీఆర్ అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, పట్టణ, గ్రామీణ అభివృద్ధి వంటి అనేక సమస్యలను కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయని, వీటన్నింటిపై తాము చర్చించామని తెలిపారు. ప్రస్తుత దేశ పరిస్థితులు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని అన్నారు. ఈ రోజు తాము కరుణానిధి ఆశీర్వాదం కూడా తీసుకున్నామని తెలిపారు.