pawan kumar: జ్యోతిబసు రికార్డు బద్దలు.. ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సాధించిన పవన్ కుమార్
- 23 సంవత్సరాల 4 నెలల 17 రోజులు సీఎంగా జ్యోతిబసు
- ఆ రికార్డును నేటితో సమం చేసిన సిక్కిం సీఎం
- హర్షం వ్యక్తం చేసిన పవన్ కుమార్ చామ్లింగ్
భారత్లో ఒక రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినది ఎవరన్న ప్రశ్నకు ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరును జవాబుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన 23 సంవత్సరాల నాలుగు నెలల 17 రోజలు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. అయితే, ఇక నుంచి మాత్రం ఈ ప్రశ్నకు సిక్కిం ముఖ్యమంత్రి, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చామ్లింగ్ అని చెప్పాల్సి ఉంటుంది.
నేటితో పవన్ కుమార్.. జ్యోతి బసు రికార్డును సమం చేశారు. జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 సంవత్సరం నవంబరు 6 వరకు సీఎంగా ఉన్నారు. ఇక పవన్ కుమార్ సిక్కిం సీఎంగా 1994 డిసెంబరు 12 నుంచి సీఎంగా ఉంటున్నారు. అంటే నేటికి 23 సంవత్సరాల నాలుగు నెలల 17 రోజులు. జ్యోతి బసు రికార్డును బద్దలు కొడుతోన్న నేపథ్యంలో పవన్ కుమార్ ఫేస్బుక్లో స్పందిస్తూ... తన వ్యక్తిగత జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నానని, తనని ఇంత కాలం సీఎంగా ఆదరిస్తోన్న తమ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
జ్యోతి బసు రికార్డును తాను అధిగమించినందుకు సంతోషంగా ఉందని, అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా సేవలందిస్తోన్న రికార్డు తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని పవన్ కుమార్ అన్నారు.