paytm wallet: పేటీఎం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్.. మరుక్షణం వ్యాలెట్ నుంచి రూ. లక్ష మాయం!
- ఢిల్లీ వాసికి చేదు అనుభవం
- మొబైల్ కు వచ్చిన ఓటీపీ తెలుసుకుని లావాదేవీలు
- వ్యాలెట్ లో ఉన్న లక్ష నిమిషాల్లో ఖాళీ
ఇంత కాలం క్రెడిట్, డెబిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాలు, పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో వాటిపైనా కన్నేశారు. ఢిల్లీ ఉత్తమ్ నగర్ కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ యజమాని ఈశ్వర్ ప్రసాద్ మొబైల్ కు ఓ రోజు ఓటీపీ వచ్చింది. ఆ సమయంలో ఆయన మొబైల్ ను చార్జింగ్ లో పెట్టి ఉంచారు.
దాంతో ఆ వెంటనే వచ్చిన కాల్ ను ఆయన కుమార్తె స్వీకరించింది. అవతలి వ్యక్తి ఓటీపీ అడగ్గా, ఆమె చెప్పేసింది. ఆ ఓటీపీ సాయంతో ఈశ్వర్ ప్రసాద్ వ్యాలెట్ నుంచి రూ.లక్ష రూపాయలను బదిలీ చేసేసుకున్నారు. వ్యాలెట్ లో ఉన్న మొత్తం నగదును మూడు లావాదేవీల్లో ఖాళీ చేసేశారు. సంబంధిత వ్యాలెట్ ను ఈశ్వర్ ప్రసాద్ తన కంపెనీ తరఫున క్లయింట్లకు చెల్లించేందుకు వినియోగిస్తున్నారు. జరిగిన విషయాన్ని కుమార్తె తర్వాత తండ్రికి చెప్పగా ఆయన ఉత్తమ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.