lalu prasad yadav: చికిత్స పూర్తికాకుండానే నన్ను డిశ్చార్జ్ చేశారు: లాలూ ఫైర్
- బలవంతంగా డిశ్చార్జ్ చేశారు
- నా ఆరోగ్యాన్ని క్షీణింపజేసే కుట్రలు జరుగుతున్నాయి
- కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటా
అనారోగ్యానికి గురైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయనను ఎయిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో, ఆయన ఆసుపత్రి నుంచి రాంచీ ఆసుపత్రికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు చికిత్స పూర్తి కాకుండానే బలవంతంగా పంపించారని మండిపడ్డారు. తన ఆరోగ్యాన్ని క్షీణింపజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని చోటుకు తనను బలవంతంగా తరలిస్తున్నారని విమర్శించారు. ఇది చాలా గడ్డు సమయమని... అయినా, తాను ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు.
మరోవైపు, లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రయాణం చేసే శక్తి ఆయనకు ఉందని ఎయిమ్స్ వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనను రాంచీలోని రాంచీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నామని చెప్పారు. మెడికల్ బోర్డు సలహా మేరకు ఆయనను డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఈ డిశ్చార్జ్ వ్యవహారం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలను ఎయిమ్స్ వైద్యులు ఖండించారు.