dinakaran: ఓట్లు వేయించుకుని డబ్బులు ఇవ్వలేదని.. దినకరన్ ను అడ్డుకున్న మహిళలు!
- తనకు ఓటేస్తే డబ్బులిస్తానని చెప్పిన దినకరన్
- ఈ రోజు ఆర్కేనగర్లో పర్యటన
- అడ్డుకున్న మహిళలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో దినకరన్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ప్రచార సమయంలో దినకరన్.. ఆర్కేనరగ్ ఓటర్లకు డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారట. తనని గెలిపిస్తే డబ్బు ఇస్తానని చెప్పి, రూ.20 నోట్లపై నెంబర్లు రాసిచ్చి, మరుసటి రోజు వచ్చి ఆ నోట్లు చూపిస్తే, డబ్బులిస్తామని చెప్పారట. అయితే, దినకరన్ గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ విషయం పట్టించుకోలేదని, ఓట్లు వేసినందుకు డబ్బు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు మహిళలు ఆందోళనకు దిగారు.
ఆర్కేనగర్లోని సమస్యలు తెలుసుకుందామని దినకరన్ వెళ్లగా, ఆయన కారుకు అడ్డుపడ్డ వందలాది మంది మహిళలు... ఎన్నికల ముందు ఇచ్చిన రూ.20 కరెన్సీ నోట్లను పట్టుకొని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి నుంచి తప్పుకోవాలంటూ మహిళలతో దినకరన్ వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. గొడవ చెలరేగుతుండడంతో పోలీసులు అందరినీ అక్కడి నుంచి పంపించారు.