chrish gayle: విహారంలో మునిగి తేలిన గేల్.. కేరళ అందాలు ఆస్వాదిస్తున్న కరీబియన్ క్రికెటర్!
- కుటుంబంతో సహా కేరళలో వాలిపోయిన గేల్
- చేపలు పట్టడంలో బిజీబిజీ
- ఈనెల 3 వరకు కేరళలోనే..
విండీస్ విధ్వంసకర ఆటగాడు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ కేరళ అందాలు ఆస్వాదించడంలో బిజీగా మారాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తున్న ఈ కరీబియన్ దిగ్గజం ఇప్పుడు చేపల వేటలో మునిగిపోయాడు. ఐపీఎల్‌లో కాస్తంత విరామం దొరకడంతో కేరళలో కుటుంబంతో వాలిపోయిన గేల్ ఓ లగ్జరీ హోటల్లో బస చేశాడు. భార్య, కుమార్తె, అత్తతో కలిసి కేరళలో షికారు కొడుతున్నాడు. ఈ నెల మూడో తేదీ వరకు ఇక్కడే గడపనున్న గేల్ హోటల్‌లో నిర్వహించిన యోగా క్లాసులకు కూడా హాజరయ్యాడు. ఇక నదిలో చేపల వేటకు వెళ్లిన అతడికి నిరాశే ఎదురైంది. పరుగులు రాబట్టడంలో దిట్ట అయిన గేల్.. చేపలు పట్టడంలో విఫలమయ్యాడు. చేపలు పడనందుకు నిరాశ పడ్డాడు.
కాగా, గేల్ అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎల్ వేలంలో తొలి రెండు రోజులు తనను ఎవరూ కొనుగోలు చేయనందుకు ఆశ్చర్యపోయినట్టు చెప్పాడు. చివరి రోజు తనపై నమ్మకంతో కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ జట్టుకు సేవలందించడమే తనముందున్న ప్రస్తుత లక్ష్యమన్నాడు. ఈ సీజన్‌లో తాను పంజాబ్‌కు ఆడాలని రాసిపెట్టి ఉన్నందుకే బెంగళూరు తనను వదిలేసుకుందని పేర్కొన్నాడు.