Kathuva: కథువా రేప్ కేసు నిందితులకు మద్దతు పలికిన ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్!
- నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు మంత్రుల రాజీనామా
- ఇదే ర్యాలీలో పాల్గొన్న కథువా ఎమ్మెల్యేకు మంత్రి పదవి
- కథువా ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొత్త ఉప ముఖ్యమంత్రి
దేశంలో ప్రకంపనలు సృష్టించిన కథువా హత్యాచార ఘటనలో నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కథువా ఎమ్మెల్యే రాజీవ్ జస్రోతియాకు ప్రమోషన్ లభించింది. సోమవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ముఖ్యమంత్రి మెహబూబాబా ముఫ్తీ.. రాజీవ్‌ను కేబినెట్లోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రేప్ కేసు నిందితులకు మద్దతుగా హిందూ ఏక్తామంచ్ నిర్వహించిన ర్యాలీలో రాజీవ్‌తోపాటు మరో ఇద్దరు మంత్రులు లాల్ సింగ్, చందర్ ప్రకాశ్ గంగా కూడా పాల్గొన్నారు. అనంతరం విమర్శలు రావడంతో మంత్రులు ఇద్దరు రాజీనామా చేశారు. ఇప్పుడు అనూహ్యంగా రాజీవ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
సోమవారం నిర్వహించిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా అందులో ఏడుగురు కొత్తవారే. వీరిలో ఇద్దరు పీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కవీందర్ గుప్తా భర్తీ చేశారు. రాజీనామా చేసిన నిర్మల్ సింగ్ స్పీకర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు, ఉపముఖ్యమంత్రిగా కవీందర్ గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే కథువా ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది చాలా చిన్న ఘటన అని పేర్కొన్నారు.