Koratala Siva: డబ్బు, పేరు కోసమే... సమాజాన్ని ఉద్ధరించాలనేమీ సినిమాలు తీయట్లేదు!: కొరటాల శివ
- సినిమా పరిశ్రమ ఓ వ్యాపారమే
- ఎవరైనా మారితే అది బోనస్
- బాలీవుడ్ నుంచీ అవకాశాలు వస్తున్నాయి
సినీ పరిశ్రమ ఓ వ్యాపారమేనని, తాము సినిమాలు తీస్తున్నది డబ్బు సంపాదన, ప్రశంసలు దక్కించుకునేందుకే తప్ప సమాజానికి సందేశాలు ఇచ్చి ఉద్ధరించాలనేమీ కాదని దర్శకుడు కొరటాల శివ వ్యాఖ్యానించాడు. వరుసగా నాలుగో విజయాన్ని 'భరత్ అనే నేను'తో అందుకున్న ఆయన, హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సినిమాలు చూసి ఎవరైనా మారితే దాన్ని బోనస్ గా లభించిన లాభమన్నట్టు భావించాలని అన్నారు. మంచి ప్రశంసలు లభించే సినిమాకు కలెక్షన్లు రావన్నది జనాల అభిప్రాయమని, దాన్ని తప్పని తన చిత్రం నిరూపించిందని అన్నాడు.
కేటీఆర్, జయప్రకాశ్ నారాయణ వంటి రాజకీయ ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారని గుర్తు చేశారు. ప్రజలందరిలో మార్పు రావాలన్న కాంక్షను ఈ చిత్రం ప్రతిబింబించడంతోనే ప్రతి ఒక్కరి మనసుకూ దగ్గరైందని చెప్పాడు. తాను ఎవరినీ మనసులో ఉంచుకుని కథ రాసుకోలేదని, వివాదరహితంగా సినిమా ఉండాలనే భావించానని అన్నాడు.
బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయని, అయితే, తనకు తెలుగు ప్రజల నాడి తెలిసినంతగా హిందీ ప్రజల నాడి తెలియదు కాబట్టి వెళ్లాలని అనుకోవడం లేదని వెల్లడించాడు. తన ఐదో చిత్రం గురించి ఆలోచించేముందు కొన్ని రోజులు సరదాగా ఫ్యామిలీతో గడుపుతానని కొరటాల శివ చెప్పాడు.