West Bengal: పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో నామరూపాల్లేని బీజేపీ... పోటీ లేకుండా 20 వేల సీట్లలో తృణమూల్ విజయం!
- చాలా చోట్ల ప్రభావం చూపని విపక్షాలు
- అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి
- టీఎంసీ బెదిరింపులకు పాల్పడిందని బీజేపీ ఆరోపణ
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి గ్రామస్థాయిలో ఎంతమాత్రమూ క్యాడర్ లేదని, వామపక్ష పార్టీల నేతలు కూడా తృణమూల్ కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారని మరోసారి స్పష్టమైంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న వేళ, వివిధ గ్రామాల్లోని 20 వేల వార్డులను తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం గమనార్హం. ఈ వార్డుల్లో కనీసం పోటీ చేసేందుకు కూడా విపక్ష పార్టీలకు అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
మొత్తం 3,358 గ్రామ పంచాయతీల్లో 48,650 స్థానాలుండగా, 16,814 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, 341 పంచాయతీ సమితుల్లోని 9,217 స్థానాల్లో 3,059 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని ప్రకటించింది. 20 జిల్లా పరిషత్ లలో 825 స్థానాలుండగా, 203 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని వెల్లడిస్తూ, పోటీ ఉన్న స్థానాల్లో మే 14న ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. కాగా, టీఎంసీ మొత్తం 1000 జిల్లా పరిషత్ స్థానాలకు నామినేషన్లు వేయగా, ఆపై బీజేపీ 782 స్థానాల్లో, సీపీఐ (ఎం) 537 కాంగ్రెస్ 407 స్థానాల్లో పోటీ పడ్డాయి.
ఇక పంచాయితీ సమితుల విషయానికి వస్తే టీఎంసీ 12,590, బీజేపీ 6,149, సీపీఐ (ఎం) 4,400, కాంగ్రెస్ 1,740 స్థానాలకు పరిమితం అయ్యాయి. నిమినేషన్ల విత్ డ్రాలోనూ టీఎంసీ తొలి స్థానంలో ఉండటం గమనార్హం. మొత్తం 2,407 స్థానాల్లో టీఎంసీ, 931 స్థానాల్లో బీజేపీ, 558 స్థానాల్లో సీపీఐ (ఎం), 301 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వారిని టీఎంసీ భయభ్రాంతులకు గురి చేసిందని రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ ఆరోపించారు. అందువల్లే క్షేత్ర స్థాయి ఎన్నికల్లో పోటీ పడేందుకు తమ నేతలు, కార్యకర్తలూ ముందుకు రాలేదని అన్నారు. చాలా ప్రాంతాల్లో నామినేషన్లు వేసిన తమ పార్టీ వారిని బెదిరించి విత్ డ్రా చేయించుకునేలా చూశారని ఆయన అన్నారు.