Karnataka: కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. యడ్యూరప్ప సీఎం అవుతారు: ప్రధాని మోదీ
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ
- కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు
- అనేక గ్రామాలకు విద్యుత్ అందించలేకపోయిందని వ్యాఖ్య
- సోనియా లేక రాహుల్ సమాధానం చెప్పాలని నిలదీత
ఈనెల 12వ తేదీన జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తుందని, యడ్యూరప్ప సీఎం అవుతారని ప్రధాని మోదీ అన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ఈ రోజు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
చామరాజనగర్ జిల్లా సంతెమారహళ్లిలో బహిరంగసభలో మాట్లాడుతూ.. "రాహుల్ నాకు ఓ సవాలు విసిరారు.. పార్లమెంటులో తాను 15 నిమిషాలు మాట్లాడితే మోదీ సభలో కూర్చోలేరని అన్నారు. సరిగ్గా చెప్పారు.. మేము మీ ముందు కూర్చోలేము. ఎందుకంటే మీరు గొప్పవారు. మీ ముందు కూర్చునేముందు మాలాంటి పనిమంతులకు ఏం స్థాయి ఉంది. మోదీ సంగతి వదిలేయండి రాహుల్.. మీరు ఒక పని చేయండి.
ఎన్నికల సందర్భంగా హిందీ లేక ఆంగ్లం లేక మీ అమ్మగారి మాతృభాష ఇటాలియన్లో 15 నిమిషాలు కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాలని కాగితం చూడకుండా మాట్లాడండి. అలా చేస్తే మీ మాటల్లో ఉన్న దమ్ము ఏంటో కర్ణాటక ప్రజలే నిర్ణయిస్తారు" అని మోదీ వ్యాఖ్యానించారు.
2005లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ.. 2009 లోపు తాము 'రాజీవ్ గాంధీ గ్రామీణ్ విద్యుతీకరణ్ యోజన' కింద దేశంలోని విద్యుత్లేని గ్రామాలన్నింటికీ విద్యుత్ అందిస్తామని అన్నారని మోదీ చెప్పారు. మరి ఎందుకు అందించలేదో సోనియా కానీ రాహుల్ గాంధీ కానీ సమాధానం చెప్పగలరా? అని మోదీ ప్రశ్నించారు. 1947 నుంచి అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 18,000 గ్రామాలకు విద్యుత్ అందించలేకపోయిందని విమర్శించారు.