Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ని నూరు శాతం అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు: ఏపీ సీఎస్
- గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి
- నాలుగేళ్లలో ప్రాథమిక స్థాయిలో పూర్తి క్వాలిటీ విద్య
- విద్య, వైద్య పరంగా మెరుగైన చర్యలు
- పాఠశాల స్థాయి నుండే నాణ్యమైన విద్య అందేలా చర్యలు
ఆంధ్రప్రదేశ్‌ని అతి త్వరలో నూరుశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ రోజు వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ప్రాథమిక, సెకండరీ విద్యా కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ... విద్య, వైద్య సేవలను సక్రమంగా అందించగలిగితే సమాజం అన్ని విధాలుగా మెరుగైన అభివృద్ధిని సాధిస్తుందని, ఈ విషయంలో మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తు తరాలకు తిరుగుండదని అన్నారు. ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు మెరుగైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించే విధంగా మంచి పునాదిని వేయాలని చెప్పారు.
ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన క్వాలిటీ విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మధ్యలో బడిమానేసే వారి సంఖ్య అధికంగా ఉన్నందున దానిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గిరిజన ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాలల్లో మూడవ తరగతి నుండే ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించే చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించామని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు వీలుగా గిరిజన సంక్షేమ శాఖను సమన్వయం చేసుకుని 15 రోజుల్లోగా అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి
రావాలని అందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్ దినేష్ కుమార్ విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేశారు.
పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ రాణించేలా మంచి పునాది ఏర్పర్చగలిగితే విద్యాపరంగా వారు భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇందుకుగానూ పాఠశాల వారీగా క్వాలిటీ విద్యను అంచనా వేసి, ఈ విషయంలో వెనుకబడిన పాఠశాలల్లో లోపాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేగాక, విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా వారు ఆయా సబ్జెక్టుల్లో అన్ని విధాలా రాణించేలా కృషి చేయాలని సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 3,500 పాఠశాలలను వర్చువల్ తరగతులుగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా మొదటి దశ కింద 931 పాఠశాలలను ఈ విధంగా కవర్ చేస్తామని అన్నారు. అలాగే, డిజిటల్ తరగతులకు సంబంధించి 5 వేల పాఠశాలలకు గానూ మొదటి, రెండు దశల కింద 2358 పాఠశాలలను కవర్ చేశామని పేర్కొన్నారు.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యా రాణి ప్రాథమిక, సెకండరీ విద్యా శాఖలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ.. పాఠశాల విద్యాపరమైన మెరుగైన ఫలితాల సాధనకు అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 2017-18 విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో గ్రాస్ ఎన్ రోల్మెంట్ రేషియో (జీఈఆర్) రాష్ట్ర స్థాయిలో 89.54శాతం లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకోగా 85.61 శాతం లక్ష్యాన్ని సాధించామని తెలిపారు.
అలాగే, ప్రాథమికోన్నత స్థాయిలో 87.01 శాతం లక్ష్యానికి గానూ 83.96 శాతం లక్ష్య సాధన చేశామని వివరించారు. అలాగే సెకండరీ స్థాయిలో 80.18 శాతం లక్ష్యానికి గానూ 79.15 శాతం లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. డ్రాప్ అవుట్ రేట్ ను గణనీయంగా తగ్గించ గలిగామని చెప్పారు. 10వ తరగతిలో ఈ ఏడాది 94.48 శాతం ఉత్తీర్ణత వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
ప్రధానంగా ఏడు ఇండికేటర్లను ఆధారంగా చేసుకుని పాఠశాలల పనితీరును మదింపు చేస్తున్నామని వివరించారు. ఇంకా ప్రాథమిక, సెంకడరీ విద్యకు సంబంధించిన వివిధ అంశాలను కమిషనర్ సంధ్యారాణి వివరించారు. ఈ సమావేశంలో రాజీవ్ విద్యామిషన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, వయోజన విద్య సంచాలకులు అమ్మాజి రావు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.