Facebook: డేటింగ్ సేవల్లోకి ఫేస్ బుక్... ఈక్విటీ వాల్యూ హైజంప్!
- అతి త్వరలో డేటింగ్ యాప్
- ప్రకటించిన మార్క్ జుకర్ బర్గ్
- 1.1 శాతం పెరిగిన ఈక్విటీ విలువ
- భారీగా నష్టపోయిన డేటింగ్ యాప్ కంపెనీలు
ఇటీవలి కాలంలో డేటా చౌర్యం తదితర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరై, ఈక్విటీ విలువను కోల్పోయిన ఫేస్ బుక్ ఒకే ఒక్క ప్రకటనతో తేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులను కలిగివున్న ఫేస్ బుక్, తన ప్లాట్ ఫామ్ పై ఓ సరికొత్త డేటింగ్ యాప్ ను ఆవిష్కరించనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా వెల్లడించారు. ఆయన ప్రకటన వెలువడగానే స్టాక్ మార్కెట్లో ఫేస్ బుక్ షేర్లు క్షణాల్లో హైజంప్ చేశాయి. సంస్థ ఈక్విటీ విలువ 1.1 శాతం పెరిగింది. అతి త్వరలోనే డేటింగ్ యాప్ సేవలు ప్రారంభమవుతాయని మార్క్ వెల్లడించారు.
ఈ యాప్ అందుబాటులోకి వస్తే, ఖాతాదారులు, ముఖ్యంగా యువత మరింత ఎక్కువ సేపు ఫేస్ బుక్ ను అంటిపెట్టుకుని ఉంటారన్నది సంస్థ ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఫేస్ బుక్ యూజర్లలో దాదాపు 20 కోట్ల మంది అవివాహితులే కావడంతో వారికి కావాల్సిన డేటింగ్ సేవలను దగ్గర చేయాలని నిర్ణయించినట్టు ఫేస్ బుక్ 8వ వార్షిక సమావేశంలో భాగంగా ఏర్పాటైన సాఫ్ట్ వేర్ డెవలపర్ల మీటింగ్ లో మార్క్ తెలిపారు. కాగా, ఫేస్ బుక్ నుంచి డేటింగ్ సేవలు ప్రారంభమైతే, ఇదే తరహా సేవలందిస్తున్న మ్యాచ్ గ్రూప్ ఇంక్ వంటి కంపెనీలకు అతిపెద్ద సవాల్ ఎదురైనట్టేనని సామాజిక మాధ్యమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫేస్ బుక్ చేసిన ప్రకటన తరువాత మ్యాచ్ గ్రూప్ ఈక్విటీ 22 శాతం పడిపోగా, దాని యాజమాన్య సంస్థ ఐఏసీ ఈక్విటీ 17 శాతం నష్టపోవడం గమనార్హం.