mobile services: విమానంలో ఇక ‘హలో’... మొబైల్ కాల్స్, ఇంటర్నెట్ సేవలకు గ్రీన్ సిగ్నల్!
- టెలికం కమిషన్ ఆమోదం
- ఓడల్లోనూ ఈ సేవలు అందించేందుకు సమ్మతి
- యాప్ ఆధారిత కాల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్
విమానం ఎక్కితే చాలు... మొబైల్స్ మూగపోతాయి. గంటల ప్రయాణమైతే బోర్ అనిపించకమానదు. కానీ, ఈ బోరింగ్ ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే విమానం నుంచి కాల్స్ మాట్లాడుకునే, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే అవకాశం మరో మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి రానుంది. టెలికం కమిషన్ ఇందుకు సంబంధించి ఇన్ ఫ్లయిట్ కనెక్టివిటీ సేవలను భారత గగనతలంలో అందించేందుకు అనుమతించింది.
శాటిలైట్ ఆధారితంగా ఈ సేవలు అందనున్నాయి. అలాగే, ఓడల్లో ప్రయాణించేవారికీ ఈ సేవలు అందించేందుకు గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. టెలికం రంగంలో వినియోగదారుల ఫిర్యాదులను మరింత మెరుగ్గా పరిష్కరించేందుకు ట్రాయ్ ఆధ్వర్యంలో అంబుడ్స్ మెన్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలియజేసింది. యాప్ ఆధారిత ఇంటర్నెట్ కాల్స్ అందించే ప్రతిపాదనకు సైతం అనుమతి తెలిపింది.