Hyderabad: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న క్రెడిట్ కార్డు స్కామ్... 4 గ్యాంగులు, వందలాది మోసాలు!
- నకిలీ పత్రాలు సమర్పించి క్రెడిట్ కార్డులు తీసుకున్న గ్యాంగ్
- కోట్లాది రూపాయల విలువైన లావాదేవీలు
- పోలీసుల అదుపులో 16 మంది నిందితులు
బ్యాంకుల సిబ్బందితో కుమ్మక్కై, నకిలీ ధ్రువపత్రాలు, పాన్, ఆధార్ కార్డులు సమర్పించి, వందలాది క్రెడిట్ కార్డులను సంపాదించి మోసాలు చేసిన నాలుగు గ్యాంగులకు చెందిన 16 మందిని హైదరాబాద్ పోలీసులు ట్రాప్ చేసి పట్టేశారు. కలకలం రేపుతున్న ఈ స్కామ్ కు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఎస్బీఐ నుంచి తనకు తెలియకుండా తన పేరిట క్రెడిట్ కార్డు జారీ అయిందని, తన కేవైసీ పత్రాలను ఎవరో దొంగిలించి ఈ పని చేశారని 21 సంవత్సరాల నవీన్ జ్యోతి అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
తీగ లాగితే అతిపెద్ద కొండే కదిలొచ్చింది. పీ శివరామ్ ప్రసాద్ అనే కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ మొత్తం మోసానికి వ్యూహకర్త. నాలుగు గ్యాంగ్ లను నియమించుకుని తప్పుడు పాన్ కార్డులను పొందడం, వాటితో బ్యాంకులకు క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేయడం, బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై కార్డులు పొందడం, వాటిని విచ్చలవిడిగా వాడటం వీరి పని. మొత్తం శివరామ్ గ్యాంగులో ఆక్సెంచర్ కు చెందిన ఐటీ ఉద్యోగి బీ రవితేజ కూడా ఉన్నాడు. గుంటూరు జిల్లా మాడుగుల గ్రామంలో డిప్యూటీ పారామెడికల్ అధికారిగా ఉన్న ఎం మోషే, వీరు తయారు చేసిన తప్పుడు పాన్ కార్డులను అటెస్ట్ చేస్తుంటాడు.
ఎస్బీఐ నుంచి మొత్తం 33 క్రెడిట్ కార్డులను పొందిన వీరు రూ. 36.83 లక్షల మేరకు కొనుగోళ్లు జరిపారు. అంతే కాదు, క్రెడిట్ కార్డులు వాడి హ్యుందాయ్ కారును, రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును, మూడు ల్యాప్ టాప్ లను, ఎన్నో స్మార్ట్ ఫోన్లనూ వీరు కొన్నారు. వీరి నుంచి 49 పాన్ కార్డులు, 19 ఓటర్ ఐడీలు, 25 చెక్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ వెల్లడించారు.
మూడు వేర్వేరు కంపెనీలను పెట్టిన వీరు వాటి పేరిట కరెంట్ ఎకౌంట్ ఖాతాలు తెరిచి 17 ఎస్బీఐ క్రెడిట్ కార్డులను పొందారని, వాటితో రూ. 1.45 కోట్ల విలువైన లావాదేవీలు నడిపారని ఆయన తెలిపారు. నవీన్ జ్యోతితో పాటు బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన కాంట్రాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న, ఎస్బీఐ మాజీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ యూ దేవీ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులు కూడా కేసు విచారణకు సహకరించాయని ఆయన తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మందిని అరెస్ట్ చేశామని కేసును విచారిస్తున్నామని తెలిపారు.