idea: ఆరు సర్కిళ్లలో ఐడియా 4జీ వోల్టే సేవలు ఆరంభం... 10జీబీ ఉచిత డేటా
- నేటి నుంచి ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో సేవలు
- ఈ సేవల్ని ఆరంభించిన నాలుగో సంస్థగా ఐడియా
- 4జీ డిమాండ్ తట్టుకునేందుకు 2జీ, 3జీ నెట్ వర్క్ లో మార్పులు
ఎట్టకేలకు పరీక్షల అనంతరం ఐడియా సెల్యులర్ దేశవ్యాప్తంగా ఆరు సర్కిళ్ల పరిధిలో 4జీ వోల్టే సేవలను ప్రారంభించింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో నేటి నుంచి ఐడియా 4జీ వోల్టే సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో వోల్టే సేవలను ఆరంభించిన నాలుగో సంస్థ ఐడియా. రిలయన్స్ జియో, వొడాఫోన్, భారతీ ఎయిర్ టెల్ ఇప్పటికే ఈ సేవలను అందిస్తున్నాయి.
వోల్టే సేవల ప్రారంభాన్ని పురస్కరించుకుని యూజర్లకు 10జీబీ డేటాను ఐడియా ఉచితంగా అందిస్తోంది. మొదటి వోల్టే కాల్ చేసిన అనంతరం 48 గంటల్లోగా యూజర్లకు ఉచిత డేటా లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న 3జీ, 2జీ నెట్ వర్క్ లను మార్పు చేసి 4జీ వోల్టే సేవలకు సిద్ధం చేయనుంది. దీంతో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవల డిమాండ్ ను తట్టుకునేందుకు వీలుగా ఐడియా తన నెట్ వర్క్ ను సిద్ధం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.