chota rajan: జర్నలిస్టు జేడే హత్య కేసులో.. మాఫియా డాన్ ఛోటా రాజన్ సహా ఏడుగురికి జీవిత ఖైదు!

  • ప్రముఖ జర్నలిస్టు జేడే హత్య కేసులో రాజన్ దోషి
  • రాజన్ సహా ఏడుగురికి జీవిత ఖైదు
  • 2011 జూన్ 11న హత్య

ప్రముఖ జర్నలిస్టు జేడే హత్య కేసులో గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ ను ముంబై స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ హత్య కేసులో రాజన్ సహా ఏడుగురికి జీవిత ఖైదును విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే, మిడ్ డే ప్రతికలో క్రైమ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న జేడేను 2011 జూన్ 11న కొందరు దుండగులు కాల్చి చంపారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు అతనిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ జేడేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. ఈ హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

ముంబైలో నేర చరిత్ర కలిగిన 20 మందికి చెందిన సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే జేడే హత్యకు గురయ్యారు. అయితే, మరో జర్నలిస్టు జిగ్నా వోరాను ఈ కేసులో నిందితురాలిగా అనుమానించి, తొలుత విచారణ చేపట్టారు. వృత్తి రీత్యా ఉన్న శత్రుత్వంతోనే ఆమె ఇతనిని హత్య చేసి ఉంటుందని భావించారు. ఆ తర్వాత లోతుగా విచారణను చేపట్టగా, అసలైన నిజాలు వెలుగు చూశాయి.

తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందునే, ఛోటా రాజన్ కక్షగట్టి సతీష్ కాలియా అనే కాంట్రాక్ట్ కిల్లర్ కు రూ. 5 లక్షలు ఇచ్చి, జేడేను హత్య చేయించినట్టు తేలింది. హత్య తర్వాత పరారైన సతీష్ ను రామేశ్వరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై నేడు కోర్టు తీర్పును వెలువరించింది. మరోవైపు, నకిలీ పాస్ పోర్టు కేసులో ఛోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు.  

  • Loading...

More Telugu News