EPFO: హ్యాక్‌కు గురైన పీఎఫ్ పోర్టల్.. రిస్క్‌లో 2.7 కోట్ల మంది డేటా!
- మార్చిలో ఈపీఎఫ్‌వో వెబ్సైట్ హ్యాక్
- సమాచార మంత్రిత్వ శాఖకు స్వయంగా లేఖ రాసిన ఈపీఎఫ్‌వో కమిషనర్
- అటువంటిదేమీ లేదన్న ఈపీఎఫ్‌వో
దేశవ్యాప్తంగా 2.7 కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారుల వివరాలు ప్రమాదంలో పడ్డాయి. ఈపీఎఫ్ఓలో రిజిస్టరైన వీరి వివరాలు చోరీకి గురైనట్టు తెలియడంతో సర్వత్ర ఆందోళన నెలకొంది. ఆధార్‌ను అనుసంధానం చేసిన ఈపీఎఫ్‌వో పోర్టల్ నుంచి మార్చిలో కోట్లాదిమంది ఖాతాదారుల వివరాలు చోరీకి గురయ్యాయంటూ సమాచార మంత్రిత్వ శాఖకు సాక్షాత్తూ కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ లేఖ రాయడం కలకలం రేపుతోంది. aadhaar.epfoservices.comలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేయాల్సిందిగా మంత్రిత్వ శాఖ సాంకేతిక సిబ్బందిని కోరారు.
‘సీక్రెట్ ’ పేరుతో ఇంటెలిజెన్స్ బ్యూరోకు కమిషనర్ రాసిన లేఖలో వెబ్‌సైట్‌లోని లోపాలే డేటా లీకేజీకి కారణమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. 2.7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల డేటా లీక్ అయినట్టు వార్తలు రావడంతో స్పందించిన ఈపీఎఫ్‌వో అటువంటిదేమీ జరగలేదని పేర్కొంటూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. డేటా లీక్‌కు సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పడేసింది. ఆధార్‌ను అనుసంధానం చేసే సైట్‌ను మరింత మెరుగ్గా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకే ప్రస్తుతం దానిని మూసివేసినట్టు తెలిపింది.