District Collector: తన కారు డ్రైవర్‌కు చివరి రోజు జీవితాంతం గుర్తుండిపోయే ట్రీట్ ఇచ్చిన కలెక్టర్!
- డ్రైవర్ దంపతులను స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంట్లో దిగబెట్టిన కలెక్టర్
- డ్రైవర్ సేవలకు కలెక్టర్ సరైన గుర్తింపు ఇచ్చారంటూ ప్రశంసలు
- గతంలో ఓ వృద్ధురాలి ఇంటికెళ్లి ఆమె కష్టాలు విన్న కలెక్టర్
చాయ్.. బిస్కెట్.. నలుగురి ఉపన్యాసాలు.. సాధారణంగా ఉద్యోగ విరమణ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగేది ఇదే. కానీ, తమిళనాడులోని కరూర్‌లో ఇందుకు భిన్నంగా జరిగింది. తనకు కారు డ్రైవర్‌గా పనిచేసి రిటైరైన డ్రైవర్‌కు కలెక్టర్ టి.అంబళగన్ జీవితాంతం గుర్తుండిపోయేలా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. డ్రైవర్ దంపతులను తన కారులో కూర్చోబెట్టుకుని స్వయంగా వారి ఇంటి వద్ద దింపి వచ్చారు.
35 ఏళ్లపాటు డ్రైవర్‌గా సేవలందించిన పరమశివమ్ ఇటీవల రిటైరయ్యారు. దీంతో ఆయన కోసం సరికొత్తగా ఏదైనా చేయాలని భావించిన కలెక్టర్ విధుల చివరి రోజు డ్రైవర్ పరమశివం, అతడి భార్యను కారులో ఎక్కించుకుని ఇంటి వద్ద దింపాలని నిర్ణయించుకున్నారు.
చివరి రోజు ఫేర్వెల్ పార్టీ ముగిశాక డ్రైవర్ దంపతులను స్వయంగా కారు వద్దకు తీసుకెళ్లిన కలెక్టర్ అంబళగన్ కారు డోర్ తెరిచి వారిని వెనక సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ పరమశివన్ ఇంటికి వెళ్లి దిగబెట్టి వచ్చారు. ఇది చూసిన వారు పరమశివం 35 ఏళ్లపాటు అందించిన సేవలకు కలెక్టర్ సరైన గుర్తింపు ఇచ్చారని ప్రశంసించారు.
డ్రైవర్ ఇంట్లో వారిని దిగబెట్టిన కలెక్టర్ అక్కడే కాసేపు ఉండి వారితో కలిసి కాఫీ తాగారు. కలెక్టర్ ఇలా తన ఉద్యోగులను ఆశ్చర్యపరచడం ఇదే తొలిసారి కాదు. ఏప్రిల్ మొదటి వారంలో 80 ఏళ్ల వయసులో అష్టకష్టాలు పడుతున్న ఓ వృద్ధురాలి గురించి తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. గంటపాటు ఉండి ఆమె సమస్యలు విన్నారు. ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని ఆమెకు వడ్డించారు. అనంతరం ఆమెకు నెలకు రూ.1,000 పింఛన్ కోసం ఆదేశాలు జారీ చేశారు.