Mumbai Indians: క్రమశిక్షణ తప్పిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఫన్నీ పనిష్మెంట్... వీడియో చూడండి!
- ఎమోజీలతో కూడిన జంప్ సూట్ ధరించాలని శిక్ష
- ఎయిర్ పోర్టుకూ అలాగే వచ్చిన ఆటగాళ్లు
- వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పోటీల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతున్న ఈషాన్ కిషన్, అంకుల్ రాయ్, రాహుల్ చబ్బార్ లు క్రమశిక్షణ తప్పడంతో వారికి జట్టు మేనేజ్ మెంట్ ఓ ఫన్నీ పనిష్మెంట్ ఇవ్వగా, దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. షెడ్యూల్ ప్రకారం జిమ్ సెషన్ కు హాజరుకాని ఈ ముగ్గురికీ ఏ శిక్ష విధించారో తెలుసా? వీరికి క్రికెట్ ఆటగాళ్లు ఎమోజీలతో కూడిన జంప్ సూట్లను ఇచ్చి వేసుకోమన్నారు. వాటితోనే బస్సులో, ఎయిర్ పోర్టులో తిరగాలని, ప్రయాణించాలని ఆదేశించారు. ఆటగాళ్లు కూడా సరదాగా ఈ జంప్ సూట్లను ధరించి సందడి చేశారు.
"నాకు రెండు రోజుల క్రితమే జిమ్ సెషన్ గురించి చెప్పారు. నేను మరచిపోయాను. జిమ్ కు వెళ్లలేదు" అని వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఈషాన్ కిషన్ వ్యాఖ్యానించాడు. ఈ డ్రస్ కాస్త ఇబ్బందిగానే ఉందని, ఎయిర్ పోర్టులో సైతం ఎవరూ గుర్తు పట్టుకుండా ఉండాలని కళ్లద్దాలు తీయలేదని, మరోసారి ఈ తప్పు చేయనని వ్యాఖ్యానించాడు.
కాగా, ఈ సీజన్ లో రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడుతున్న ముంబై జట్టు ఇప్పటివరకూ కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు పాయింట్లతో, పాయింట్ల పట్టికలో కిందనుంచి రెండో స్థానంలో నిలిచి, ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు విధించిన ఫన్నీ పనిష్మెంట్ వీడియోను మీరూ చూడవచ్చు.