USA: శాన్ ఫ్రాన్సిస్కోలో ఎన్నారై ఘాతుకం... సహోద్యోగిని డేటింగ్ కు రాలేదన్న కక్షతో ఆమె బాయ్ ఫ్రెండ్ హత్య!
- శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న కెవిన్ ప్రసాద్
- అక్కడే పనిచేసే యువతిపై కన్నేసిన ప్రసాద్
- అంగీకరించకపోవడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ హత్య
తనతో డేటింగ్ కు వచ్చేందుకు ఓ యువతి అంగీకరించడం లేదన్న ఆగ్రహంతో ఆమె బాయ్ ఫ్రెండ్ ను హత్య చేశాడో ప్రవాస భారతీయ యువకుడు. ఇప్పుడు అతనికి మరణశిక్ష లేదా జీవితఖైదు తథ్యమని అంటున్నారు అక్కడి న్యాయనిపుణులు. కాలిఫోర్నియా పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కెవిన్ ప్రసాద్ (31) శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ సేవలందిస్తున్నాడు.
అదే చోట ఓ యువతి కూడా పనిచేస్తోంది. ఆమెను ఎలాగైనా వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రసాద్ పలుమార్లు ఆమెను డేటింగ్ కు రమ్మని ఆహ్వానించాడు. నగలు కూడా బహూకరించి మభ్యపెట్టాలని చూశాడు. అయితే, దాన్ని తిరస్కరించిన ఆమె, తనకు దీర్ఘకాలంగా మార్క్ మంగాక్కట్ (31) అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, తమకు మూడేళ్ల బిడ్డ కూడా ఉందని చెప్పి తప్పించుకునేది.
ఈ క్రమంలో తలకు ముసుగు ధరించిన ఓ యువకుడు మంగాక్కట్ కారు వద్దకు వచ్చి అతన్ని తుపాకితో కాల్చి చంపాడు. విచారణ ప్రారంభించిన పోలీసులకు తొలుత నిందితుడి గురించి ఒక్క క్లూ కూడా లభించలేదు. ఆపై విచారణలో మంగాక్కట్ కు ఎటువంటి గ్యాంగులతోనూ సంబంధం లేదని తెలిసింది. ఇదే సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రసాద్ సహోద్యోగినిని విచారిస్తున్న క్రమంలో, పనిచేసే చోట ఓ యువకుడు తనను డేటింగ్ కు రావాలని ఒత్తిడి చేస్తుండేవాడని ఆమె చెప్పగా, పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. దీంతో ప్రసాద్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడైన డొనోవాన్ మ్యాథ్యూ రివీరా సహాయంతో అతను మంగాక్కట్ ను హత్య చేశాడని పోలీసులు తేల్చారు. అతనిపై మర్డర్ కేసు పెట్టి కోర్టుకు తరలించారు.