purandeswari: కర్ణాటకలో పురందేశ్వరి ప్రచారం.. తెలుగు వ్యక్తి ప్రశ్నకు షాక్!
- ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరిని నిలదీసిన తెలుగు రైతు
- ఏపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతోనే ఎందుకుంటున్నావంటూ ప్రశ్న
- బీజేపీ పట్ల వ్యతిరేకత చూపుతున్న తెలుగు ప్రజలు
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కీలక నేతలంతా ప్రచారపర్వంలో మునిగిపోయారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీకి తెలుగు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో, రాయచూరు జిల్లాలో ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకురాలు పురందేశ్వరిని ఓ తెలుగు రైతు ఉక్కిరిబిక్కిరి చేశాడు.
ఇంతకీ పురందేశ్వరిని ఆయన ఏమడిగారంటే... 'అమ్మా, పోయిన ఎన్నికల్లో కూడా నువ్వు ఇక్కడకు వచ్చి ప్రచారం చేశావ్. అప్పడు కాంగ్రెస్ కు ఓటేయమన్నావ్. ఇప్పుడు వచ్చి, బీజేపీకి ఓటేయమంటున్నావ్. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలతోనే ఎప్పుడూ ఎందుకుంటున్నావమ్మా?' అంటూ నిలదీశారు.
దీంతో అవాక్కైన పురందేశ్వరి సమాధానం కోసం ఆలోచిస్తున్నంతలోపలే... 'మీ స్థానంలో వేరొకరు ఉంటే అడిగేవాడ్ని కాదమ్మా. మాది గుడివాడ తాలూకా. మీ నాన్నగారు టీడీపీ స్థాపించినప్పుడు, పార్టీ జెండా మోశా. ఆ అభిమానంతోనే అడుగుతున్నా' అంటూ కొనసాగించారు. దీనికి సమాధానంగా... రాష్ట్రాలని బట్టే పరిస్థితులు మారతాయని, న్యాయం చేసే పార్టీలకే ఓటు వేయమని చెబుతున్నానని, తనది రాజకీయం కాదని చెప్పి పురందేశ్వరి అక్కడ నుంచి వెళ్లిపోయారట. ప్రచారంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు పురందేశ్వరికి పలుచోట్ల ఎదురవుతున్నాయని చెబుతున్నారు.