YSRCP: ఉత్సాహ భరిత క్షణాలు.. జానపద కళాకారులతో జగన్!
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర
- డప్పు వాయించమంటూ జగన్ కు స్టిక్స్ అందజేసిన కళాకారులు
- జగన్ తో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర 152వ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం నుండి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జగన్ కు పలువురు తమ సమస్యలు విన్నవించుకున్నారు. జగన్ తో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. ఈ పాదయాత్రలో జానపద కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా తమ వాయిద్య పరికరాలను కళాకారులు వాయించారు. డప్పు వాయించే స్టిక్స్ ను జగన్ కు అందజేసి మోగించాల్సిందిగా కళాకారులు కోరగా, వారి కోరికను ఆయన మన్నించారు.
కాగా, ఈ పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ, ‘‘రైతుల్ని చల్లగా చూడాలన్నా..’ అంటూ గోపువానిపాలెం గ్రామానికి చెందిన చలమలశెట్టి స్వాతి అనే చెల్లెమ్మ అంది. ఏమైందమ్మా.. అని అడిగాను. మాకు తాతముత్తాతల నుంచి వచ్చిన 1.15 ఎకరాల భూమి ఉంది. దానిమీదే ఆధారపడి జీవిస్తున్నాం. పోర్టు కోసం అంటూ మా భూముల్ని లాక్కోవాలని చూస్తున్నారు. ఉన్న ఆ కాస్త భూమీ పోతే మేమెలా బతకాలి..?
మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారికి ఏమివ్వాలి.. వారికి చదువులెలా చెప్పించాలి.. పెళ్లిళ్లెలా చేయాలి.. ఒకవేళ, భూములిచ్చినా పరిహారం ఇస్తారన్న నమ్మకం లేదు. భూములిచ్చాక పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తే మా పరిస్థితేంటి.. ఎవరు పట్టించుకుంటారు.. రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి చూశాక మాలో భయం మరింత పెరిగిందన్నా.. చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు.. మీ ప్రభుత్వం వచ్చాకన్నా రైతుల్ని బాగా చూసుకోవాలి’ అని ఎంతో ఆవేదనగా, ఆర్తిగా చెప్పింది.
సాయంత్రం పొట్లపాలెంలో కలిసిన అక్కచెల్లెమ్మలదీ అదే బాధ. వేణుమాణిక్యం అనే అక్క ‘అన్నా.. మేమంతా పాడిపంటల మీద ఆధారపడి బతుకుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా పాడిని దెబ్బకొట్టారు.. ఉన్న పంటనేలనూ పోర్టు కోసం లాక్కోవాలనుకుంటున్నారు. పోర్టు భూములంటూ ప్రకటించాక.. బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఎకరం సుమారు రూ.50 లక్షలకు పైగా విలువచేసే మా భూముల్ని పది, పన్నెండు లక్షలకే దౌర్జన్యంగా తీసుకోవాలనుకుంటోందీ ప్రభుత్వం.
ప్రభుత్వం మాది.. మేం చెప్పిన రేటుకే ఇవ్వాలి.. అంటే ఎలా? మమ్మల్ని చంపినాసరే సెంటు భూమి కూడా ఇవ్వం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వం బలవంతంగా భూముల్ని లాక్కుంటుందేమో.. పరిహారం కూడా రాదేమోనన్న భయంతో కొందరు తక్కువ ధరకే భూముల్ని అమ్మేసుకున్నారట. ఎంత దారుణం? పోర్టు నిర్మాణం ముసుగులో స్వార్థ ప్రయోజనాల కోసం పేదల పొట్టగొట్టడం ఎంత అన్యాయం? 4,800 ఎకరాల్లోనే సకల సౌకర్యాలతో అధునాతన పోర్టును నిర్మించవచ్చని తెలిసి కూడా.. మచిలీపట్నం పట్టణానికి ఆనుకుని ఉన్న అత్యంత విలువైన 33 వేల ఎకరాల భూముల్ని తీసుకోవాలనుకోవడంలో ఆంతర్యమేంటి? ఇది దోపిడీ కాక మరేంటి? భూముల్ని త్యాగం చేసిన రైతులు ఆనందంగా లేనప్పుడు అది అభివృద్ధి ఎలా అవుతుంది?’ అని జగన్ ప్రశ్నించారు.