Telangana: రైతు బంధు చెక్కుల పంపిణీకి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలి: తెలంగాణ సీఎస్ జోషి
- 10వ తేదీ నుండి రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
- తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్
- ఇప్పటివరకు 52.73 పాసు పుస్తకాలకు ఆధార్ సీడింగ్ పూర్తయింది
ఈ నెల 10 నుండి గ్రామాలలో రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి సంబంధించి సచివాలయం నుండి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా మంచినీటి సదుపాయం, ఓటరు స్లిప్ ల జారీ, ఎండబారిన పడకుండా షెడ్ నెట్స్ కల్పించాలని ఆదేశించారు. గ్రామాల వారీగా పంపిణీ షెడ్యూల్ ను ముందుగానే రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 57.33 లక్షల పాసు పుస్తకాలకుగాను 52.73 పాసుపుస్తకాలకు ఆధార్ సీడింగ్ పూర్తయిందని, దాదాపు 3.30 లక్షల ఖాతాలకు సంబంధించి ఆధార్ సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పారు. సాంకేతిక సమస్యలతో ఆధార్ లేని వారికి చెక్కులను నిరాకరించకుండా చూడాలని, వారి వివరాలు తీసుకొని ఆధార్ జారీకి చర్యలతో పాటు బయోమెట్రిక్ వివరాలను పొందిన అనంతరం వీరికి పాసుపుస్తకాల జారీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
వీరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సి.సి.ఎల్.ఏ కార్యాలయానికి పంపాలని, రైతు బంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్ల కోసం జిల్లాకు 2 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7గంటల వరకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్ ఓఎఫ్ ఆర్, అసైన్డ్ ల్యాండ్ కు సంబంధించిన రైతులకు చెక్కులు జారీ చేసేలా చూడాలని, 23 జిల్లాలలోని 182 మండలాలలో 91,992 మంది లబ్దిదారులకు సంబంధించి 2.99 లక్షల ఎకరాలకు ఆర్ ఓఎఫ్ ఆర్ సర్టిఫికెట్ల ప్రకారం 119 కోట్లు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. చెక్కుల విత్ డ్రా సమయంలో నగదు కొరత రాకుండా బ్యాంకర్లతో సమీక్షించాలని, మండలాలకు వెళ్ళే బృందాలు తప్పనిసరిగా పహాణీ ప్రింటౌట్ ను వెంట తీసుకువెళ్ళాలని, ప్రతి గ్రామంలో చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ సమయంలో పిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతులు తమ చెక్కులను నగదుగా మార్చుకునే సమయంలో ఫొటో ఐడెంటిటీ ఆధారంగా డబ్బులు ఇచ్చేలా బ్యాంకర్లను ఆదేశించాలని అన్నారు.
రైతు బంధు చెక్కులకు సంబంధించి 58.06 లక్షల చెక్కులను ముద్రించామని, 54.3లక్షల చెక్కులు ఇప్పటికే మండలాలకు చేరాయని, మిగతా 3.75 లక్షల చెక్కులు 2 లేదా 3 రోజులలో జిల్లాలకు చేరుకుంటాయని, ప్రతి చెక్కుకు సంబంధించి అకౌంట్ చేయాలని అన్నారు. ఇప్పటికే మండలాలకు చేరిన చెక్కుల వివరాలను సరిచూసుకోవాలని, పంపిణీ చేసిన చెక్కులతో పాటు పంపిణీ చేయని చెక్కుల వివరాలు రూపొందించుకోవాలని చెప్పారు.
ధరణి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు
ధరణి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఈ నెల 7 నుండి ప్రయోగాత్మకంగా 5 మండలాల్లో, ఈ నెల 19 నుండి జిల్లాకు ఒక్కటి చొప్పున 30 మండలాలలో తహసీల్దార్ల ద్వారా రిజిష్ట్రేషన్ కార్యకలాపాలను ప్రారంభించడం జరుగుతుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి చెప్పారు. దీనిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి తహసీల్దార్లకు తగు శిక్షణతో పాటు రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని ఆదేశించారు.
అనంతరం, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి మాట్లాడుతూ, కలెక్టర్లు ముఖ్యభూమిక పోషించాలని, రైతులు తమ చెక్కులను నగదుగా మార్చుకునే విషయమై తగు ఆదేశాలు జారీ చేస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఆధార్ వివరాలు సమర్పించని రైతుల వివరాలను గ్రామాల వారీగా తయారు చేసి గ్రామాలలో చదవాలని, పూర్తి వివరాలు నమోదైన ఖాతాలకు సంబంధించిన వెంటనే డిజిటల్ సిగ్నెేచర్లు చేసి పాసుపుస్తకాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.