Andhra Pradesh: ఉద్యోగాల కల్పనకే పరిశ్రమల ఏర్పాటు : ఏపీ సీఎస్ దినేష్ కుమార్
- ఏపీలో పారిశ్రామిక రంగం ప్రగతిపై సమీక్ష
- పరిశ్రమల ఏర్పాటులో నిర్లక్ష్యం చూపొద్దు
- త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించిన సీఎస్
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ముఖ్యోద్దేశం ఉద్యోగాల కల్పనేనని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ప్రగతిపై ఈరోజు సమీక్షా సమావేశంతోపాటు వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో తొలుత, పారిశ్రామిక రంగం ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆరోఖ్య రాజ్ వివరించారు.
పరిశ్రమల ఏర్పాటులో నిర్లక్ష్యం చూపొద్దని, భూముల కేటాయింపు, ఇతర అనుమతుల మంజూరులో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను దినేష్ కుమార్ ఆదేశించారు. విశాఖ-చెన్నై కారిడార్ పనుల పురోగతితో పాటు మొదటి దశ పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. రెండో దశ పనులు కూడా త్వరగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ముఖ్యోద్దేశం ఆర్థిక లబ్ధి సాధించడమే కాదని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, దీని కోసమే పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు అందజేస్తోందని తెలిపారు. కేవలం పరిశ్రమలకు రాయితీలు అందజేయడంతోనే సరిపెట్టుకోవద్దని, వాటి ఏర్పాటు, ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారనే విషయాలపై దృష్టి సారించాలని సూచించారు.
ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటు కోసం త్వరితగతంగా అనుమతులివ్వాలని, నిర్దేశించిన గడువులోగా భూములు కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను దినేష్ కుమార్ ఆదేశించారు. పరిశ్రమలు త్వరగా ఏర్పడి, ఉద్యోగాలు లభించినప్పుడు భూములిచ్చిన ప్రజలు సంతృప్తి చెందుతారని, పరిశ్రమల ప్రగతిపై ప్రతి నెలా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. రోడ్డు కనక్టివిటీపై తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు.