Andhra Pradesh: ఇంతకన్నా చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా?: రోజా
- రాష్ట్రంలో 40 రోజుల్లో 45 అత్యాచారాలు
- దాచేపల్లి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయలేదు
- చంద్రబాబు అనుభవం ఏమైపోయింది?
- నిప్పులు చెరిగిన ఆర్కే రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 40 రోజుల వ్యవధిలో 45 అత్యాచార కేసులు నమోదయ్యాయని, ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. ఈ ఉదయం దాచేపల్లికి వచ్చి అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, అన్ని విభాగాల్లో ప్రభుత్వం విఫలమైందని, ఇంతకన్నా చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు. తనకు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏమైందని అడిగారు.
ఎక్కడో లైటు ఆగిపోతే తనకు తెలుస్తుందని ప్రగల్భాలు పలుకుతున్న ఆయన, ఇంతమంది ఆడపిల్లల మానప్రాణాలు పోతుంటే దాన్ని కనిపెట్టే టెక్నాలజీ లేదా? అన్నారు. చంద్రబాబు నివసిస్తున్న గుంటూరు జిల్లాలో ఓ చిన్నారిపై అత్యాచారం జరిగి 48 గంటలు దాటినా నిందితుడిని అరెస్ట్ చేయలేదని, కనీసం ఇక్కడికి వచ్చి అమ్మాయి కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని నిప్పులు చెరిగారు. పేదలంటే చంద్రబాబుకు చులకనని, వారిని ఓదారిస్తే, తనకు లాభం లేదని ఆయన అనుకుంటున్నారని మండిపడ్డారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, చంద్రబాబు పరిపాలనలో నేరస్తులకు ధైర్యం పెరుగుతోందని ఆరోపించారు. గతంలో అత్యాచారాలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నిందితులను కఠినంగా శిక్షించి వుంటే ఇప్పుడిలా జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.