Tirumala: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు వచ్చేశాయ్!
- 56,310 టికెట్లు విడుదల
- ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో 9,960 టికెట్లు
- జనరల్ కేటగిరీలో 46,350 టికెట్లు
ఆగస్టు నెల తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ ఉదయం ఆన్ లైన్లో విడుదల చేశారు. మొత్తం 56,310 టికెట్లను ఆన్ లైన్ లో లక్కీ డ్రా, సాధారణ బుకింగ్ విధానంలో భక్తులకు అందుబాటులో ఉంచినట్టు టీటీడీ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ లాటరీ కింద 9,960 సేవా టికెట్లను ఉంచామని, వీటిల్లో సుప్రభాతం 6,805, తోమాల సేవ 80, అర్చన 80, అష్టదళ పాదపద్మారాధన 120, నిజపాదదర్శనం 2,875 టికెట్లు ఉంటాయని తెలిపారు.
వీటిని పొందగోరే భక్తులు నేటి నుంచి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకూ టీటీడీ అధీకృత వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ విజేతలను ఎంపిక చేసి, వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ విధానాల్లో సమాచారాన్ని అందిస్తామని, ఆపై వారు రెండు రోజుల్లోగా ఎంపికైన సేవకు డబ్బు చెల్లించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.
ఇక జనరల్ కేటగిరీలో 46,350 టికెట్లను అందుబాటులో ఉంచామని, వీటిల్లో విశేషపూజ 1,500, కల్యాణోత్సవం 10,925, ఊంజల్ సేవ 3,450, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,325, వసంతోత్సవం 11,550, సహస్ర దీపాలంకరణ సేవ 12,600 టికెట్లను సాధారణ విధానంలో ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.