Karnataka: రైతులకు రుణమాఫీ, మహిళలకు స్మార్ట్ ఫోన్లు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లు... కన్నడిగులపై బీజేపీ వరాల జల్లు... మ్యానిఫెస్టో విడుదల!
- గెలిపిస్తే అభివృద్ధికి బాటలు
- రూ. 1.50 లక్షల కోట్లతో రైతు రుణ మాఫీ
- పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు, తక్కువ వడ్డీకి రుణాలు
- మ్యానిఫెస్టోను విడుదల చేసిన యడ్యూరప్ప
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ బీజేపీ ఈ ఉదయం మ్యానిఫెస్టోను విడుదల చేస్తూ, హామీల వర్షం కురిపించింది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ సమావేశంలోనే దీనిపై సంతకం చేస్తామని చెప్పింది. ఇందుకోసం రూ. 1.50 లక్షల కోట్లు కేటాయిస్తామని చెప్పింది.
మహిళలకు అతి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తామని హామీ ఇచ్చింది. దళిత విద్యార్థులకు విద్యా రుణాలను మంజూరు చేస్తామని, పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తామని, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను ఇస్తామని ప్రకటించింది. ఈ ఉదయం బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
రైతుబంధు మార్కెట్ నిధిని రూ. 5 వేల కోట్లతో ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని తెలిపింది. కనీస మద్దతు ధరను 1.5 రెట్లు పెంచుతామని పేర్కొంది. స్త్రీ ఉన్నతి ఫండ్ ను రూ. 10 వేల కోట్లతో స్థాపించి, మహిళల సాధికారతకు కృషి చేస్తామని వెల్లడించింది. కే-హబ్ స్థాపించి, హుబ్లీ, రాయచూరు, కాలాబుర్గి, మంగళూరు ప్రాంతాల్లో ఔత్సాహిక సాంకేతిక నిపుణులకు సాయపడతామని వెల్లడించింది. వ్యవసాయ కూలీలకు, భూమిలేని వారికి ఎటువంటి రుసుము లేకుండా రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని దగ్గర చేస్తామని వెల్లడించింది.