dachepally: దాచేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. మృతదేహాన్ని అప్పగించాలంటున్న ఆందోళనకారులు!
- మంత్రుల కాన్వాయిలను అడ్డుకున్న గ్రామస్తులు
- పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం
- మృతదేహంపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న స్థానికులు
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి ఘటనలో నిందితుడు రామ సుబ్బయ్య... గురజాల మండలం దైద అమరలింగేశ్వర ఆలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. మృతుడు సుబ్బయ్యేనని హోంమంత్రి చినరాజప్ప ప్రకటించినప్పటికీ ఆ గ్రామస్తులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావుల కాన్వాయ్‌లను అడ్డుకున్నారు.
సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేయడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అలాగే ఆందోళనకారులు ప్రభుత్వ అధికారులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోస్టుమార్టం నిర్వహించకముందే తమకు ఆ మృతదేహాన్ని చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మృతదేహం నిందితుడిదేనా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.