dasari: కాకతాళీయమో, యాదృచ్ఛికమో అలా జరిగిపోయింది: దాసరి విగ్రహావిష్కరణలో బాలయ్య
- దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి
- ఫిలిం ఛాంబర్లో తలసాని చేతుల మీదుగా విగ్రహావిష్కరణ
- దాసరి 150వ చిత్రం 'పరమవీర చక్ర'లో నటించానన్న బాలయ్య
- ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తని వ్యాఖ్య
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ రోజు హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... కాకతాళీయమో, యాదృచ్ఛికమో దాసరి 150వ చిత్రం 'పరమవీర చక్ర' సినిమాలో నటించానని అన్నారు. ఆయన దర్శకత్వంలో నటించడం ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు.
'శివరంజని సినిమాను బాలకృష్ణతో చేస్తానని నాన్నగారికి దాసరి నారాయణరావు చెప్పారు. కానీ, బాబు చదువుకుంటున్నాడు వద్దులేండీ అని నాన్నగారు అన్నారు. దాసరి సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన మన గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఆయనది అందరితో కలిసిపోయే స్వభావం.
అలాగే, కుండబద్దలు కొట్టినట్లు అన్ని విషయాలు మాట్లాడుతారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఇవన్నీ కలిపిన నిండుకుండలాంటి వ్యక్తి దాసరి నారాయణ రావు" అని బాలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కృష్ణ, విజయ నిర్మల, అల్లు అరవింద్, మురళీ మోహన్, సురేశ్ బాబు, వీవీ వినాయక్, సురేశ్ బాబు పాల్గొన్నారు.