Telangana: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఓ బూటకం : టీపీసీసీ నేత శ్రవణ్ దాసోజు
- మోదీ, అమిత్ షా కుట్రలో భాగంగానే థర్డ్ ఫ్రంట్
- యూపీఏని, కాంగ్రెస్ ని బలహీనపరచాలని చూస్తున్నారు
- ముఖ్యమంత్రులు మమతా, నవీన్ పట్నాయక్ తదితర నేతలకు టీపీసీసీ లేఖ
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించడం విదితమే. తాజాగా, టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రవణ్ దాసోజు స్పందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఓ బూటకమని, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుట్రలో భాగంగానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, డీఎంకే నేత స్టాలిన్ తదితర నేతలకు తాను లేఖలు రాసినట్టు శ్రవణ్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో యూపీఏని, కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగంగానే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటించారని, జాతీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.